

ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం రెండో విడతలో అదనంగా 3,29,201 మందికి లబ్ధి చేకూరనుంది. తొలుత ప్రభుత్వం అంచనా వేసిన సంఖ్య కంటే మరో 58,601 మంది విద్యార్థులు పెరగడంతో, పథకం అమలుకు రూ.87.9 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా పథకాన్ని అమలు చేసేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు పెరిగింది. పథకం కోసం అయ్యే మొత్తం వ్యయం కూడా రూ.10,120.78 కోట్ల నుంచి రూ.10,208.69 కోట్లకు చేరింది.
రెండో విడత లబ్ధిదారులకు త్వరలోనే నగదు విడుదల చేయనున్నారు. దసరాలోపు వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుల్లో చేరాల్సిన విద్యార్థులు, అలాగే రికార్డులు సక్రమంగా లేనివారిని మినహాయించి 64,76,590 మందికి పథకం అమలు చేశారు. షెడ్యూల్ ప్రకారం రెండో విడత నగదును ఆగస్టు 30న విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ, కొన్ని కారణాలతో ఆలస్యమైంది. తాజాగా అదనపు లబ్ధిదారులకు కూడా పథకాన్ని వర్తింపజేసేందుకు అనుమతులు మంజూరు కావడంతో నగదు విడుదలపై ఆశలు పెరిగాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!