

మెగా డీఎస్సీ-2025లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై కర్నూలుకు చెందిన ప్రతాప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నకిలీ ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాలు సమర్పించి పలువురు అభ్యర్థులు ఉద్యోగాలు పొందారని పిటిషనర్ ఆరోపించారు. ఈ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు.
మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయగా, వాటిలో 10 శాతం అంటే సుమారు 1,600 పోస్టులను ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు లేదా నిబంధనల్లో పేర్కొన్న భూమి పరిమితులకు లోబడి ఉన్నవారే ఈ రిజర్వేషన్‌కు అర్హులని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి సుమారు వెయ్యి మంది ఉద్యోగాలు పొందారని, దాదాపు 800 మంది అభ్యర్థులు దీనివల్ల నష్టపోయారని ఆరోపించారు. ఒక జిల్లాలోనే 70 మంది నకిలీ పత్రాలు సమర్పించినట్లు ఆధారాలు కోర్టుకు అందజేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ పేర్కొనడంతో, ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరించాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. సీబీఐ విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పాలని కోరగా, వారం రోజుల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. నకిలీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సమర్పించినట్లు తేలితే ఆ ఉద్యోగాన్ని తదుపరి అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థికి కేటాయిస్తామని డీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తమకు ఉద్యోగావకాశం లభిస్తుందని బాధిత అభ్యర్థులు ఆశిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!