

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. 2029లోపు భాజపా నేతృత్వంలోని ఎన్డీయే పాలిత 21 రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తామని ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత అంశాల్లో మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ ఒకే రకమైన చట్టాన్ని వర్తింపజేయడమే యూసీసీ ఉద్దేశమని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో దీనిని అమలు చేశామని చెప్పారు.
దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశామని అన్నారు. 2014కు ముందు అవినీతి, వారసత్వ రాజకీయాలు కొనసాగాయని, తమ ప్రభుత్వం దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. భారత్‌ను బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితా నుంచి ప్రపంచంలోని టాప్-5 ఆర్థిక వ్యవస్థల్లోకి తీసుకొచ్చామని, తొలి త్రైమాసికంలో 7.8 శాతం జీడీపీ వృద్ధి నమోదైందని తెలిపారు. ఆర్టికల్ 370, నక్సలిజం, ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతి వంటి అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!