

హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న పాలలో ప్రమాదకర రసాయనాలు కలిపి కల్తీ చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామంలో ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, పాలపొడి కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నెల 6న మహేశ్వరం జోన్ ఎస్‌ఓటీ, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి పోచారానికి చెందిన అండె శ్రీశైలం (43)ను అరెస్ట్ చేశారు.
నిందితుడి వద్ద నుంచి 100 లీటర్ల అనుమానిత కల్తీ పాలు, ఒక లీటరు హైడ్రోజన్ పెరాక్సైడ్, కిలో బరువున్న 35 పాలపొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాలను హైదరాబాద్ వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితుడిని తదుపరి దర్యాప్తు కోసం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను ఆహార పదార్థాల్లో కలపడం ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని అధికారులు హెచ్చరించారు. పాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఆహార కల్తీకి పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!