

ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ ఉన్నత విద్యను కొనసాగించే దిశగా మరో కీలక అడుగు వేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ (బి.ఏ.) కోర్సులో ఆయన అధికారికంగా ప్రవేశం పొందారు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తైన అనంతరం గురువారం యూనివర్సిటీని సందర్శించిన రాహుల్ రామకృష్ణ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చక్రపాణి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బి.ఏ. కోర్సు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ రామకృష్ణ, ఉన్నత విద్యను పూర్తి చేయలేకపోయిన వారికి, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల చదువు మధ్యలో నిలిపివేసిన వారికి ఓపెన్ యూనివర్సిటీ గొప్ప అవకాశమని అన్నారు. ఎంత పేరు, డబ్బు సంపాదించినా సమాజంలో విద్యకు ప్రత్యేకమైన విలువ ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇంజినీరింగ్ చదువును మధ్యలోనే నిలిపివేశానని, ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మళ్లీ విద్యను కొనసాగిస్తున్నానని తెలిపారు. ఆదివాసీలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత విద్య అందిస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!