

వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మెసేజ్లను ముందుగానే షెడ్యూల్ చేసుకునే ‘సెండ్ లేటర్’ ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ను ఎంపిక చేసిన బీటా యూజర్లతో పరీక్షిస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్లు టెక్స్ట్ సందేశాలు, వెబ్సైట్ లింకులు, ఫొటోలు, వీడియోలను ముందుగానే సిద్ధం చేసి, తమకు కావాల్సిన సమయంలో ఆటోమేటిక్గా పంపేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. వ్యక్తిగత చాట్లతో పాటు గ్రూప్ చాట్లలోనూ ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నిర్ణీత సమయానికి సందేశాలు పంపేందుకు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ ఫీచర్ ఉపయోగపడనుంది.
షెడ్యూల్ చేసిన సందేశాలను పంపే ముందు యూజర్లు పరిశీలించుకోవడంతో పాటు, అవసరం లేదనుకుంటే వాటిని తొలగించుకునే సదుపాయం కూడా ఉండనుంది. షెడ్యూల్ చేసిన సందేశాన్ని తొలగించినప్పుడు, దాని గురించి అవతలి వ్యక్తికి నోటిఫికేషన్ వెళ్లదని సమాచారం. సందేశాల భద్రతకు వాట్సాప్ ఎన్క్రిప్షన్ సదుపాయం కూడా వర్తించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్లోని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. సాధారణ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!