

ప్రపంచంలోని ప్రముఖ చిప్‌సెట్ల తయారీ సంస్థల్లో ఒకటైన ఎన్విడియా ప్రస్తుతం తన సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ నెలకొన్న వివాదంతో పాటు నాయకత్వ మార్పుపై చర్చలను ఎదుర్కొంటోంది. చైనా మహిళా గూఢచారితో హువాంగ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ, వాటి కారణంగా చైనాకు 7.5 బిలియన్ డాలర్ల విలువైన చిప్స్ తరలిపోయాయని కొన్ని కథనాలు ఆరోపించాయి. ఈ పరిణామాలు కంపెనీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలకు స్వతంత్ర ధ్రువీకరణ లేదు. మరోవైపు, కంపెనీ రోజువారీ కార్యకలాపాలు, కీలక నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో హువాంగ్ పాత్ర అత్యంత కీలకంగా ఉండటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలతో పోలిస్తే ఎన్విడియాలో తదుపరి నాయకత్వానికి స్పష్టమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదని సైనోవస్ ట్రస్ట్ కంపెనీ పేర్కొన్నట్లు కథనాలు వెల్లడించాయి. కృత్రిమ మేధ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారీ వృద్ధిని సాధిస్తున్న ఎన్విడియాలో నాయకత్వ మార్పు జరిగితే మార్కెట్‌లో అనిశ్చితి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జెన్సన్ హువాంగ్ 1993లో క్రిస్ మలచోవ్‌స్కీ, కర్టిస్ ప్రీమ్‌లతో కలిసి ఎన్విడియాను స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే సంస్థకు సీఈఓగా కొనసాగుతున్నారు. కంపెనీలో ఆయనకు 3.56 శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ, సుమారు 60 మంది ఉన్నతాధికారులు నేరుగా ఆయనకు నివేదించేలా సంస్థాగత వ్యవస్థ ఉందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది. ఉద్యోగుల జీతభత్యాలు, సంస్థలోని చిన్నచిన్న నిర్ణయాలపైనా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతారని సమాచారం. ఆయన కుమార్తె మాడిసన్ ఉత్పత్తులు, సాంకేతిక మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా, కుమారుడు స్పెన్సర్ రోబోటిక్స్ విభాగంలో ఉత్పత్తుల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులనే నాయకత్వ స్థానాల్లో నియమించాలనే ఉద్దేశం తనకు లేదని, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని హువాంగ్ గతంలో స్పష్టం చేశారు. భవిష్యత్తులో సీఈఓ బాధ్యతలు చేపట్టగల వారిలో మాజీ సేల్స్ చీఫ్ జై పురి, సీఎఫ్‌వో కొలెట్ క్రెస్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హువాంగ్‌కు మద్దతుగా ప్రశంసలు కురిపించారు. సోమ, మంగళవారాల్లో కలిపి 10 శాతానికి పైగా పడిపోయిన ఎన్విడియా షేరు బుధవారం 4.3 శాతం కోలుకున్నట్లు కథనం పేర్కొంది. కంపెనీ ఆదాయం, లాభాల మార్జిన్లు, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు లభించిన భారీ ప్రతిఫలాలు ఎన్విడియా ప్రపంచ టెక్నాలజీ రంగంలో సాధించిన ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!