

చైనా మార్కెట్‌లో భారతీయ సేవా ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న వ్యాపార ప్రతిబంధకాలు, ఆంక్షలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కఠినమైన లైసెన్సింగ్ నిబంధనలు, డేటా స్థానికీకరణ, సైబర్ భద్రతా నిబంధనలు, వీసాలు, పని అనుమతుల జారీలో జరుగుతున్న ఆలస్యంపై పరిశ్రమ ప్రతినిధుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. చైనా మార్కెట్‌లో భారతీయ సంస్థల విస్తరణకు అడ్డుగా నిలుస్తున్న ప్రధాన సమస్యలను గుర్తించడం ఈ సమీక్ష లక్ష్యం.
చైనా ఏటా సుమారు 300 బిలియన్ డాలర్ల విలువైన సేవలను దిగుమతి చేసుకుంటుండగా, 2024 గణాంకాల ప్రకారం అందులో భారత వాటా కేవలం 8.95 బిలియన్ డాలర్లుగా ఉంది. సమాచార సాంకేతికత, ఐటీ ఆధారిత సేవలు, డిజిటల్ పరిష్కారాల్లో భారత్‌కు మంచి సామర్థ్యం ఉన్నప్పటికీ, చైనాలో అమలవుతున్న స్థానిక ఆంక్షల కారణంగా భారతీయ కంపెనీలు నేరుగా సేవలు అందించలేకపోతున్నాయి. దీంతో అనేక సంస్థలు మూడో పక్ష ఏజెన్సీల ద్వారా మాత్రమే సేవలు అందించాల్సిన పరిస్థితి నెలకొంది.
డేటా స్థానికీకరణ, సరిహద్దులు దాటి సమాచార బదిలీ నిబంధనలతో పాటు భారత్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ), చైనా వ్యక్తిగత సమాచార రక్షణ చట్టం (పీఐపీఎల్) మధ్య ఉన్న సరిపోలికలను కేంద్రం పరిశీలిస్తోంది. పరస్పర గుర్తింపు ఒప్పందాలు, ధ్రువీకరణ ప్రమాణాలు, నగదు బదిలీలు, పన్నులు, అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపైనా సమీక్ష కొనసాగుతోంది. వీసాలు, పని అనుమతులు, నిపుణుల నియామకంలో జాప్యానికి రాజకీయ అంశాలు కూడా కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతుల్లో భారత వాటా 2014లో 3 శాతం నుంచి 2024 నాటికి 4.3 శాతానికి పెరిగింది. కొవిడ్ అనంతరం సేవల ఎగుమతుల వార్షిక వృద్ధి 14 శాతానికి చేరింది. ప్రతిబంధకాలు తొలగితే చైనాలో డిజిటల్, అంతరిక్ష సేవల రంగాల్లో భారతీయ సంస్థలకు మరిన్ని అవకాశాలు లభించవచ్చు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!