హెచ్-1బీ వీసాల జారీకి అమెరికా తీసుకొచ్చిన తాజా నిబంధనలతో టెక్ కంపెనీలకు విదేశీ ఉద్యోగుల నియామకం మరింత భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీసాలు, ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడకుండా భారత్‌లోనే తన కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులో భారీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది.
బెంగళూరులోని ప్రముఖ టెక్ హబ్ అయిన వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో దాదాపు 20 వేల మంది ఉద్యోగులకు సరిపడేలా గూగుల్ మెగా క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తోందని కథనం పేర్కొంది. ఇప్పటికే ఒక ఆఫీసు టవర్‌ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ లీజుకు తీసుకోగా, మరో రెండు టవర్ల కోసం చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం మూడు టవర్లు కలిపి సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనున్నాయి. మొదటి టవర్‌లో వచ్చే కొన్ని నెలల్లోనే కార్యకలాపాలు ప్రారంభించనుండగా, మిగిలిన రెండు టవర్ల నిర్మాణం వచ్చే ఏడాది నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి భవనం లీజును ఆల్ఫాబెట్ అధికారికంగా ధ్రువీకరించింది. ప్రస్తుతం భారత్‌లో గూగుల్‌కు సుమారు 14 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వైట్‌ఫీల్డ్ క్యాంపస్ పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభిస్తే, అమెరికా వెలుపల గూగుల్ కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, టెక్ కంపెనీలు భారత్‌పై మరింత దృష్టి సారిస్తున్నాయి. మార్కెట్ అభివృద్ధి, అధునాతన ఇంజినీరింగ్ కార్యకలాపాలకు భారత్ కీలక కేంద్రంగా అవతరిస్తోంది. ఇప్పటికే ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ భారత్‌లో అడుగుపెట్టగా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి. మరోవైపు, హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు కూడా కంపెనీల విస్తరణ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల ఫీజు విధించడంతో, అమెరికాకు విదేశీ ఉద్యోగులను తీసుకెళ్లడం కంటే భారత్‌లోనే కార్యకలాపాలు కొనసాగించడం అనేక సంస్థలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా అనుకూలంగా మారింది. వీసా ఆలస్యాలు, అధిక ఖర్చులను తప్పించుకునే ఉద్దేశంతోనే గూగుల్ ఈ కొత్త క్యాంపస్ ప్రణాళికలను అమలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!