

భారత్‌లో స్వయంగా ఎదిగిన పారిశ్రామికవేత్తల జాబితాలో ఈసారి ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. డీమార్ట్ సూపర్మార్కెట్ల అధిపతి రాధాకిషన్ దమానీని వెనక్కి నెట్టి ఆయన అగ్రస్థానానికి చేరారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో, క్విక్ కామర్స్ వేదిక బ్లింకిట్‌ల మాతృసంస్థ అయిన ఎటర్నల్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.3.2 లక్షల కోట్లకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో, డీమార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్ విలువ 13 శాతం తగ్గి రూ.3 లక్షల కోట్లకు పరిమితమైంది. దీంతో ఈ ఏడాది జాబితాలో దమానీ రెండో స్థానానికి జారుకున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రమోటర్లు రాహుల్ భాటియా, రాకేశ్ గంగ్వాల్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇండిగో మార్కెట్ విలువ రూ.2.2 లక్షల కోట్లుగా ఉంది. ఇండిగో ప్రమోటర్లు టాప్-10లో స్థానం దక్కించుకోవడం ఇదే తొలిసారి. ఈ వివరాలను ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ – హురున్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన ‘టాప్-200 సెల్ఫ్ మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2025’ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమైన వ్యాపారాల్లో కనీసం రూ.4,500 కోట్ల విలువ ఉన్న కంపెనీలను ఈ జాబితాలో చేర్చారు. ఐడీఎఫ్సీ–హురున్ కలిసి ఈ జాబితాను విడుదల చేయడం ఇది మూడోసారి.
ఈ జాబితాలో నాలుగో స్థానంలో మ్యాక్స్ హెల్త్‌కేర్ లిమిటెడ్ (రూ.1,10,700 కోట్లు) చైర్మన్ అభయ్ సోయ్ నిలిచారు. ఐదో స్థానంలో తెలుగు పారిశ్రామికవేత్తలు శ్రీహర్ష మాజేటి, నందన్ రెడ్డి నిలిచారు. వీరు స్థాపించిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మార్కెట్ విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉండగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 5 శాతం వృద్ధి సాధించింది.
పేటీఎం (రూ.72,900 కోట్లు) వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. గత ఏడాదిలో పేటీఎం విలువలో 67 శాతం వృద్ధి నమోదైంది. లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకులు పియూష్ బన్సల్, అమిత్ చౌదరి, నేహా బన్సల్, సుమీత్ కపాహి పదో స్థానంలో నిలిచారు. లెన్స్‌కార్ట్ వ్యాపార విలువ ఏడాది కాలంలో 60 శాతం పెరిగి రూ.67,000 కోట్లకు చేరుకుంది.
ఈ జాబితాలో ఉన్న 200 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.42 లక్షల కోట్లకు చేరగా, ఇది గత ఏడాది నమోదైన రూ.36 లక్షల కోట్లతో పోలిస్తే 15 శాతం అధికం. ఈ సంస్థల్లో సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్వయం శక్తితో ఎదిగిన పారిశ్రామికవేత్తలు స్థాపించిన బిలియన్ డాలర్లకు పైగా విలువైన కంపెనీల సంఖ్య ఈ ఏడాది 128కి చేరింది. 2024లో ఈ సంఖ్య 121గా ఉంది.
నగరాల వారీగా చూస్తే, ఈ జాబితాలో అత్యధికంగా బెంగళూరుకు చెందిన సంస్థలు (52) ఉన్నాయి. ఆ తర్వాత ముంబై (41), గురుగ్రామ్ (36), చెన్నై (11), ఢిల్లీ (10), హైదరాబాద్ (8), పూణే (8) ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!