

ఛత్తీస్గఢ్లో కోల్ ఇండియాకు చెందిన గెవ్రా గని వచ్చే ఏడాదిలో 63 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి చేసే గనిగా నిలుస్తుందని సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు హరీష్ దుహాన్ వెల్లడించారు. కోల్ ఇండియా అనుబంధ సంస్థ నిర్వహిస్తున్న ఈ గని దేశంలోనే అతిపెద్ద ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిగా గుర్తింపు పొందింది. 1981 నుండి ఇక్కడ తవ్వకాలు కొనసాగుతుండగా, ఈ ఏడాది 56 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల సామర్థ్యానికి విస్తరించేందుకు ఇప్పటికే పర్యావరణ అనుమతి కూడా లభించింది. 2026-27 నాటికి 63 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి ప్రపంచంలోనే నంబర్ వన్ గనిగా మారాలని సంస్థ ధీమా వ్యక్తం చేసింది.
ప్రస్తుతం అమెరికాలోని వయామింగ్ రాష్ట్రంలో ఉన్న బ్లాక్ థండర్ గని సుమారు 61 నుంచి 62 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత నార్త్ యాంటెలోప్ రోషెల్ గని నిలుస్తోంది. ఈ గనులను అధిగమించేందుకు గెవ్రా గనికి అవసరమైన నాలుగు కీలక వనరులు తమ వద్ద సమృద్ధిగా ఉన్నాయని హరీశ్ తెలిపారు. తగినంత భూమి, ఆధునిక యంత్రాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది, అలాగే బొగ్గు స్వీకరించే వినియోగదారుల బలమైన గిరాకీ తమ బలమని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో పాటు సరఫరా ఒప్పందాలు కూడా బలంగా ఉన్నాయని, భారతీయ రైల్వేల సహకారంతో ఉన్న మౌలిక వసతులు బొగ్గు రవాణాను సులభతరం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక సంస్థలోనే 700 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా ఖనిజ రంగంలో కొన్ని ప్రాజెక్టులను అమలు చేయడానికి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. 2026-27 నాటికి గెవ్రా గని నుంచి 63 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి, ప్రస్తుతం 62 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్న బ్లాక్ థండర్ గనిని అధిగమిస్తామని ప్రాంతీయ ప్రధాన నిర్వాహకుడు అరుణ్ కుమార్ త్యాగి విశ్వాసం వ్యక్తం చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!