

రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టును ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయెర్తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో, దేశంలో విమానాల తయారీ యూనిట్‌ను ఎంబ్రాయెర్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. వ్యాపార, వాణిజ్య, సైనిక విమానాలు అలాగే విమానాల విడిభాగాల తయారీలో ఈ సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
చిన్న, మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్ కూడా పోటీలో ఉంది. అయితే ఏపీలో ప్రధాన లేదా అనుబంధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుకూల అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైన భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అంశంపై వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశముంది.
అనంతపురం ఎంపికకు కారణం
అనంతపురం జిల్లాలో విస్తారమైన భూములు అందుబాటులో ఉండటం, బెంగళూరుకు సమీపంలో ఉండటం ప్రధాన అనుకూల అంశాలుగా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ సంస్థకు ఇక్కడ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాల తయారీకి అనుమతులు ఇచ్చారు. ఈ సంస్థ రూ.1,300 కోట్ల పెట్టుబడితో 6 సీట్ల విమానాల తయారీ కేంద్రాన్ని 500 ఎకరాల్లో ‘స్కై ఫ్యాక్టరీ’గా అభివృద్ధి చేయనుంది. 2029 నాటికి ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. ఇదే ప్రాంతంలో మరిన్ని ఖాళీ భూములు ఉండటంతో, వాటిని కొత్త విమానాల తయారీ కేంద్రానికి కేటాయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
లేపాక్షి ప్రాంతం కూడా పరిశీలనలో
శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన 8,844 ఎకరాలతో పాటు మొత్తం 20 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, విమానాల తయారీ ప్రాజెక్టుకు అవసరమైన భూములను ఇందులో భాగంగా కేటాయించాలని యోచిస్తోంది. జాతీయ రహదారి, బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు ప్రయోజనంగా మారింది. కంపెనీ ప్రతినిధుల అవసరాలను బట్టి భూములు కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!