

సంబంధిత పార్టీలతో లావాదేవీల వివరాల వెల్లడిలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఉల్లంఘనలతో పాటు కొన్ని ఆడిట్ నిబంధనలకు సంబంధించిన అంశాలపై అదానీ గ్రూపునకు చెందిన ఐదు సంస్థలు సెబీతో సెటిల్‌మెంట్ చేసుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థలు కలిపి రూ.1.508 కోట్లు చెల్లించాయి. ఈ సెటిల్‌మెంట్‌లో భాగంగా సంస్థలు ఆరోపణలను అంగీకరించలేదు, తిరస్కరించలేదు.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించిన సంబంధిత పార్టీల లావాదేవీల వెల్లడితో పాటు కార్పొరేట్ పాలనకు సంబంధించిన అంశాలపై సెబీ జరిపిన పరిశీలన అనంతరం ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. సెటిల్‌మెంట్ ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.76.05 లక్షలు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.45.50 లక్షలు చెల్లించగా.. అదానీ టోటల్ గ్యాస్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థలు ఒక్కొక్కటి రూ.9.75 లక్షలు చెల్లించాయి. కొన్ని సంబంధిత పార్టీల లావాదేవీలను వెల్లడించకపోవడం, చెల్లుబాటు అయ్యే పీర్ రివ్యూ ధ్రువీకరణ లేని ఆడిట్ సంస్థల నివేదికలు సమర్పించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.
ఈ సెటిల్‌మెంట్‌తో ప్రస్తుతం పేర్కొన్న సెబీ న్యాయపరమైన విచారణలు ముగిశాయి. అయితే, హిండెన్‌బర్గ్ నివేదికలో చేసిన అన్ని ఆరోపణల నుంచి అదానీ గ్రూపునకు పూర్తిగా క్లీన్‌చిట్ లభించినట్లు దీనిని భావించకూడదు. హిండెన్‌బర్గ్ ఆరోపణలకు సంబంధించి ఇతర అంశాలపై సెబీ గతంలో ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు గతంలో ఖండించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!