

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం భారత్–వెస్టిండీస్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా, టికెట్ల విక్రయాలు వివాదానికి దారితీశాయి. ‘టికెట్ జీన్’ యాప్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన కొద్దిసేపటికే సోల్డ్ అవుట్ అని చూపించడంతో పలువురు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేదంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మ్యాచ్ టికెట్ల ధరలు రూ.750 నుంచి రూ.20 వేల వరకు ఉన్నాయని హెచ్‌సీఏ వెల్లడించింది. ఒక్కొక్కరు గరిష్ఠంగా నాలుగు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునేలా నిబంధన పెట్టామని, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు మొబైల్ టు మొబైల్ టికెట్ బదిలీ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. విద్యార్థులకు 2,500, సైనికులకు 250 టికెట్లు కేటాయించినట్లు పేర్కొంది.
మరోవైపు, మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న నలుగురిని గోషామహల్ పోలీసులు అరెస్టు చేశారు. బేగంబజార్‌లోని ఎస్ఓ మాల్‌పై దాడి చేసి ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించిన టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి 11 టికెట్లు, ఐదు సెల్ఫోన్లు, దాండియా పాసులు, ద్విచక్ర వాహనం, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నకిలీ టికెట్లు, బుకింగ్ లింకుల ద్వారా మోసాలను అరికట్టేందుకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. మ్యాచ్ సందర్భంగా 2,200 మంది పోలీసులతో భద్రత కల్పించడంతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్లు, ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. ప్రేక్షకుల రాకపోకల కోసం ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులను నడపనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!