

సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో నిరాశపరిచిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ.. ఇప్పుడు అద్భుతంగా పుంజుకుంది. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సాత్విక్-చిరాగ్ జంట 21-15, 18-21, 21-11తో ప్రపంచ 29వ ర్యాంక్ మలేసియా జోడీ నుర్ మహ్మద్ అర్జియాన్-టాన్ వీ కియాంగ్‌పై విజయం సాధించింది. గంటా 6 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్ ఆరంభంలో 0-5తో వెనుకబడిన భారత జోడీ.. వెంటనే పుంజుకుని 7-5 ఆధిక్యంలోకి వెళ్లింది. విరామ సమయానికి 11-9తో ఆధిక్యంలో నిలిచి చివరకు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
రెండో గేమ్ హోరాహోరీగా సాగింది. 5-5, 13-13తో స్కోరు సమమైన దశలో 18-18 వద్ద మలేసియా జోడీ వరుసగా మూడు పాయింట్లు సాధించి నిర్ణాయక గేమ్‌కు తీసుకెళ్లింది. అయితే మూడో గేమ్‌లో సాత్విక్-చిరాగ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. విరామానికి 11-4తో భారీ ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత జోడీ.. అదే జోరుతో మ్యాచ్‌ను ముగించింది. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాకు చెందిన హె జి టింగ్-రెన్ జియాంగ్ యు జోడీతో సాత్విక్-చిరాగ్ తలపడనున్నారు. ఈ ఏడాది మేలో సింగపూర్ ఓపెన్ టైటిల్ గెలిచిన భారత జోడీ.. ఇప్పుడు మరో పెద్ద టైటిల్‌పై కన్నేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!