

డిఫెండింగ్ ఛాంపియన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాస్ యుఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో చైనాకు చెందిన యిబింగ్ వుపై 6-3, 6-4, 6-1తో ఘన విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో కాస్త ఇబ్బందిపడిన అల్కరాస్.. మూడో రౌండ్లో తనదైన దూకుడుతో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏడో సీడ్ డానియల్ మెద్వెదెవ్ కూడా రిండర్‌నెచ్‌ను 6-4, 6-4, 6-4తో ఓడించి తదుపరి రౌండ్‌కు చేరాడు. సిట్సిపాస్, టామీ పాల్ కూడా మూడో రౌండ్ అడ్డంకిని అధిగమించారు. తొలి రౌండ్లో జకోవిచ్‌కు షాకిచ్చిన అర్జెంటీనా ఆటగాడు నవోనె మాత్రం తన దేశానికే చెందిన ఎచెవెరీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ ఎలినా స్వితోలినా కలిన్‌స్కాయా చేతిలో ఓడగా, ఏడో సీడ్ ముచోవా నవారో చేతిలో పరాజయం పాలైంది. ఆరో సీడ్ నోస్కోవా ప్రిక్వార్టర్స్ చేరింది. పొటపోవా పదో సీడ్ అనిసిమోవాకు షాకివ్వగా, జెంగ్ మాడిసన్ కీస్‌ను ఓడించింది. మహిళల డబుల్స్‌లో సెరెనా విలియమ్స్–వీనస్ విలియమ్స్ జంట తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది. మరోవైపు టాప్ సీడ్ ఆర్యానా సబలెంకాకు మూడో రౌండ్‌లో విచిత్ర అనుభవం ఎదురైంది. రఖిమోవాతో మ్యాచ్‌లో కోర్టు చుట్టూ గంజాయి వాసన వస్తోందని, అది తన ఏకాగ్రతను దెబ్బతీస్తోందని ఆమె ఛైర్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!