

బిగ్ బాస్ తెలుగు 10 తొలి వారంలోనే మరో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్జే చరణ్ షాకింగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ తర్వాత ఇప్పుడు చైత్ర రాయ్ కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. తాజా ఎపిసోడ్‌లో ‘మహా పరీక్ష’ ఫార్మాట్‌లో మరో కీలక మార్పు కనిపించింది. ఇకపై ఇంట్లో టీమ్స్ ఉండవని, ప్రతి కంటెస్టెంట్ తన ఆటను తానే ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇప్పటికే చరణ్ ఎలిమినేషన్‌తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన షో.. చైత్ర ఎలిమినేషన్‌తో మరింత ఉత్కంఠగా మారింది. హై రిస్క్ జోన్‌లో ఉన్న చైత్రకు తదుపరి టాస్క్‌లో పాల్గొనే అవకాశం కూడా లభించలేదు.
మరోవైపు ఈ ఎపిసోడ్‌లో త్రిగుణ్ ఆట తీరుపై కూడా చర్చ జరిగింది. అమన్‌తో మాట్లాడిన త్రిగుణ్.. రోహిత్ విషయంలో అతడిని ప్రభావితం చేసేలా మాట్లాడినట్లు కనిపించింది. టాస్క్‌ల విషయంలో త్రిగుణ్ వ్యవహరిస్తున్న తీరుపై ముఖేష్ గౌడ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుధీర్, ఝాన్సీలతో మాట్లాడుతూ.. త్రిగుణ్ ఒక సందర్భంలో ఒకలా, మరో సందర్భంలో మరోలా మాట్లాడుతున్నాడని ముఖేష్ పేర్కొన్నాడు. ఏ విషయంలోనైనా ఒకే స్టాండ్‌పై ఉండాలని సుధీర్ కూడా అభిప్రాయపడ్డాడు. మరోవైపు రోహిత్‌తో ఇంటి పనులు, ముఖ్యంగా గిన్నెలు కడగడం విషయంలో త్రిగుణ్‌కు విభేదాలు కొనసాగాయి.
ఇక టాస్క్‌ల విషయానికి వస్తే.. వర్షిణి, సుధీర్‌లను కష్టమైన టాస్క్‌కు, మిగిలిన కంటెస్టెంట్లను ఈజీ టాస్క్‌కు ఎంపిక చేశారు. ‘రన్ రాజా రన్’ టాస్క్‌లో రామ్ ప్రసాద్ విజయం సాధించి నో రిస్క్ ప్రయోజనాన్ని దక్కించుకున్నాడు. అనంతరం హై రిస్క్ బ్యాడ్జ్‌ను అమన్‌కు ఇచ్చాడు. ఆ తర్వాత సుధీర్, వర్షిణిలకు హౌస్‌మేట్‌గా మారే అవకాశం కల్పించారు. అయితే వారిద్దరూ తాము టాస్క్ పూర్తి చేసి సేఫ్ అయ్యామని మిగిలిన కంటెస్టెంట్లను నమ్మించాల్సి వచ్చింది. కానీ రామ్ ప్రసాద్, ముఖేష్ సహా పలువురు వారి మాటలను నమ్మలేదు. చివరకు వారి అనుమానమే నిజమైంది. టాస్క్‌లో విఫలమైన సుధీర్, వర్షిణి ఇద్దరూ హై రిస్క్ జోన్‌లోకి వెళ్లారు.
దీంతో అమన్, చైత్ర, సుధీర్, వర్షిణి నలుగురు హై రిస్క్‌లో ఉండగా.. వారిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఎలిమినేషన్ చర్చలో వర్షిణి, అమన్, సుధీర్‌లు చైత్ర పేరును సూచించారు. తనకు ఇప్పటివరకు సరైన టాస్క్ అవకాశాలు రాలేదని, అందుకే తన ఆటను నిరూపించుకోలేకపోయానని చైత్ర చెప్పింది. అయినప్పటికీ అత్యధిక ఓట్లు ఆమెకే రావడంతో బిగ్ బాస్ చైత్ర రాయ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. చరణ్ తర్వాత చైత్ర కూడా తొలి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ కావడంతో.. బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభం నుంచే అనూహ్య మలుపులతో సాగుతోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!