

సినిమా పేరు: వంద దేవుళ్లు
విడుదల తేదీ: జూన్ 19, 2026
నటీనటులు: విజయ్ ఆంటోనీ, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్
దర్శకుడు: శశి
నిర్మాతలు: మీరా విజయ్ ఆంటోనీ
సంగీత దర్శకుడు: బాలాజీ శ్రీరామ్
సినిమాటోగ్రాఫర్: విజి సతీష్
ఎడిటర్: హరీష్ యువరాజ్
విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం వంద దేవుళ్లు. వాసవి (స్వాసిక) అనే ఒంటరి తల్లి తన ఇద్దరు కుమారులు భాస్కర్ (అజయ్ ధీషన్), వివేక్ (శక్తి)లను కష్టపడి పెంచుతుంది.
జీవితంలో ఒక దశలో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తుంది. కానీ ఆమె కుమారుడు భాస్కర్ సమాజం ఏమనుకుంటుందనే ఆలోచనతో దానికి వ్యతిరేకిస్తాడు. కొన్నేళ్ల తర్వాత తన తప్పును తెలుసుకుని తల్లికి ఒక తోడు అవసరమని భావిస్తాడు. అయితే అప్పటికే వాసవి పెళ్లికి సిద్ధంగా ఉండదు. చివరకు ఆమె నిర్ణయం ఏమిటి? ఈ కథలో ఏడు కొండలు (విజయ్ ఆంటోనీ) పాత్ర ఏమిటి? అనేది సినిమా కథ.
ఈ సినిమాకు ప్రధాన బలం స్వాసిక నటన. వాసవి పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. ఒక తల్లి బాధ, ఒంటరితనం, భావోద్వేగాలను సహజంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నిజ జీవిత పరిస్థితులకు దగ్గరగా ఉండే కథాంశాన్ని దర్శకుడు శశి నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. కుటుంబ బంధాలు, సమాజపు ఆలోచనలను సహజంగా చూపించారు.
అజయ్ ధీషన్ తన పాత్రకు న్యాయం చేయగా, రెండో భాగంలో విజయ్ ఆంటోనీ ఎంట్రీ సినిమాకు మరింత బలం ఇచ్చింది. విజయ్ ఆంటోనీ, స్వాసిక మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
సినిమాలో ప్రధాన సమస్య మొదటి భాగం నెమ్మదిగా సాగడం. తల్లి, కొడుకుల మధ్య ఒకే సంఘర్షణ చుట్టూ ఎక్కువ సన్నివేశాలు తిరగడంతో కొంత బోరింగ్‌గా అనిపిస్తుంది.
ఎమోషనల్ కథకు మరింత బలమైన స్క్రీన్‌ప్లే అవసరం. కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కావాల్సినంత భావోద్వేగ ప్రభావం కనిపించదు.
కొన్ని సహాయ పాత్రలను సరిగా ఉపయోగించలేదు. అలాగే భావోద్వేగ సన్నివేశాల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కథ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
దర్శకుడు శశి మంచి సందేశంతో కూడిన కథను ఎంచుకుని భావోద్వేగాలను సహజంగా చూపించారు. అయితే కథనం మరింత వేగంగా ఉండాల్సింది.
విజి సతీష్ సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా చూపించింది. హరీష్ యువరాజ్ ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. బాలాజీ శ్రీరామ్ సంగీతం కథకు తగ్గట్టుగా ఉంది. తెలుగు డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి.
మొత్తంగా వంద దేవుళ్లు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కుటుంబ కథా చిత్రం. స్వాసిక అద్భుత నటన సినిమాకు పెద్ద బలం కాగా, విజయ్ ఆంటోనీ పాత్ర రెండో భాగాన్ని ఆసక్తికరంగా మార్చింది. అయితే నెమ్మదైన మొదటి భాగం, బలహీనమైన స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్ అయ్యాయి. ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం ఒకసారి చూడదగ్గ సినిమా.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!