

హైదరాబాద్‌లోని ఫాక్స్ సాగర్ చెరువు పరిధిలో ఆక్రమణల తొలగింపునకు హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలు, గేట్లను తొలగించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీ గోడతో పాటు గేటును కూడా కూల్చివేశారు. దూలపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 124లో సుమారు 15 ఎకరాల ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టి నింపి ప్రహరీ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. చెరువు హద్దుల్లోని ఆక్రమణలను తొలగించే చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టారు.
చెరువులో సుమారు అర కిలోమీటరు మేర నిర్మించిన బండ్‌పై కూడా హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. బండ్‌ను ఆనుకుని ఫామ్‌హౌస్ కోసం నిర్మించిన ప్రహరీ గోడను తొలగించారు. మరోవైపు జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్లు 41, 42లో సుమారు 20 ఎకరాల ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ప్రహరీ గోడను కూడా కూల్చివేశారు. ఈ చర్యలను సుప్రీంకోర్టు న్యాయవాది సౌరబ్‌రాజ్ వర్మ అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే అధికారులు ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్ హద్దులను చూపిస్తూ ఆక్రమణల తొలగింపును కొనసాగించారు. చెరువు పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!