

తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో రైల్వే అధికారులను అప్రమత్తం చేసిన ఘటన చోటుచేసుకుంది. జోలార్‌పేట రైల్వే స్టేషన్ యార్డులో ఏడు కోచ్‌లతో కూడిన ఖాళీ గూడ్స్ రైలును నిలిపి ఉంచగా.. అది అకస్మాత్తుగా ఆటోమేటిక్‌గా వెనక్కి కదిలింది. జోలార్‌పేట, సోమనాయకన్‌పట్టి స్టేషన్ల మధ్య ఉన్న తామలేరిముత్తూర్ వరకు సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే జోలార్‌పేట స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అయితే, తామలేరిముత్తూర్ వద్ద గూడ్స్ రైలులోని ఏడు కోచ్‌లూ పట్టాలు తప్పాయి. వాటిలో రెండు బోగీలు ప్రధాన రైల్వే లైన్‌పైకి వెళ్లడంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్‌ను తిరుపత్తూర్ స్టేషన్‌కు మళ్లించారు. అక్కడి నుంచి ఆ రైలు బెంగళూరుకు బయల్దేరింది.
సమాచారం అందుకున్న రైల్వే భద్రతా సహాయక బృందం, అధికారులు, రైల్వే భద్రతా దళం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్‌లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనతో బెంగళూరు నుంచి జోలార్‌పేటకు వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును సోమనాయకన్‌పట్టి స్టేషన్‌లో నిలిపివేశారు. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్న మరో ఎక్స్‌ప్రెస్ రైలును కూడా మార్గమధ్యంలో ఆపేశారు. గూడ్స్ రైలు వెనక్కి కదలడానికి గల కారణాలపై చెన్నై డివిజినల్ రైల్వే మేనేజర్ విచారణకు ఆదేశించారు. దెబ్బతిన్న ప్రధాన లైన్‌కు అర్ధరాత్రి మరమ్మతులు చేపట్టి 12 గంటలకల్లా పునరుద్ధరించారు. సోమవారం ఉదయం ఆరు గంటలకు పట్టాలు తప్పిన ఏడు కోచ్‌లను తొలగించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!