

అర్నబ్ తుపాను ప్రభావంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు కర్ణాటక ప్రభుత్వం సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. విద్యుత్తు మరమ్మతులు, మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు అవసరమైన సిబ్బంది, పరికరాలను పంపించాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడానని, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. విద్యుత్తు శాఖ మంత్రి కేజే జార్జ్ నేతృత్వంలో 500 మంది లైన్‌మెన్లు, క్రేన్లు, ఎర్త్ ఆగర్లు కలిగిన 15 పాల్‌ఫింగర్ లారీలు, 25 ట్రాక్టర్ ఆధారిత డ్రిల్లింగ్ యంత్రాలను ఏపీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సహాయక బృందాలు సోమవారం మధ్యాహ్నమే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి బయలుదేరాయి. ప్రతి పది మంది లైన్‌మెన్ల బృందానికి ఒక జూనియర్ ఇంజినీరు, ఒక సహాయక ఇంజినీరు నేతృత్వం వహిస్తారు. అన్ని బృందాల పనితీరును ఒక కార్యనిర్వాహక ఇంజినీరు సమన్వయం చేస్తారు. సిబ్బంది ప్రయాణం, ఇతర ఖర్చులను కర్ణాటక ప్రభుత్వమే భరిస్తుందని శివకుమార్ తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ప్రాధాన్యమిస్తూ సహాయం అందించాలన్న నిబద్ధతతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!