

విడుదల తేదీ: మే 29, 2026
నటీనటులు: విరాజ్ అశ్విన్, రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ మరియు ఇతరులు
దర్శకుడు: సతీష్ కాసెట్టి
నిర్మాతలు: రాజీవ్ చిలక, మేఘా చిలక
సంగీత దర్శకుడు: ఇళయరాజా
సినిమాటోగ్రాఫర్: అరవింద్ కన్నబిరాన్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
కథ:
వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) అనే కాలేజీ విద్యార్థిని సంజయ్ అలియాస్ సంజు (విరాజ్ అశ్విన్)ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. కార్పొరేటర్ కుమారుడైన సంజు స్వతంత్రంగా జీవిస్తూ ఒక కాఫీ షాప్ నిర్వహిస్తుంటాడు. అయితే వెంకటలక్ష్మి తన ప్రేమను అతనికి ఎప్పుడూ చెప్పదు. ఇదే సమయంలో ఆమెకు విదేశాల నుంచి వచ్చిన మరీచిక (రెజీనా కసాండ్రా)తో పరిచయం ఏర్పడుతుంది.
అనుకోకుండా మరీచిక, సంజు ఒకరికొకరు దగ్గరవడంతో పెళ్లి చేసుకుంటారు. అయితే ఒకరోజు మరీచిక సంజును హత్య చేస్తుంది. దీంతో షాక్‌కు గురైన వెంకటలక్ష్మి పోలీసులను ఆశ్రయిస్తుంది. అసలు మరీచిక ఎవరు? ఆమె సంజును ఎందుకు చంపింది? ఈ హత్య వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
ప్లస్ పాయింట్లు:
సాధారణ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కథను ఎంచుకోవడం దర్శకుడి ధైర్యాన్ని చూపిస్తుంది. కథలోని మిస్టరీ, సైకలాజికల్ అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ భాగాలు బాగున్నాయి.
ముఖ్యంగా చివరి భాగంలో అజయ్ ఘోష్, రెజీనా, అనుపమల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రెజీనా తన పాత్రలో సహజంగా నటించగా, అనుపమ అమాయక యువతిగా మెప్పించింది. విరాజ్ అశ్విన్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రేమ, మిస్టరీ, సైకలాజికల్ అంశాల మేళవింపు కొంతవరకు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.
మైనస్ పాయింట్లు:
సినిమాకు ప్రధాన బలహీనత నెమ్మదిగా సాగే కథనం. ఆసక్తికరమైన కథాంశం ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపడంలో దర్శకుడు పూర్తిగా సఫలీకృతం కాలేకపోయారు. మొదటి భాగం చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.
రెండో భాగం చివర్లో మెరుగుపడినప్పటికీ, కీలక ట్విస్టులను బయటపెట్టే క్రమంలో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుంది. ముఖ్యంగా హత్య కేసు దర్యాప్తు అంశాన్ని బలహీనంగా చూపించడం వల్ల కథలోని ఉత్కంఠ తగ్గిపోతుంది. పోలీసు దర్యాప్తు విశ్వసనీయంగా లేకపోవడం సినిమా ప్రభావాన్ని దెబ్బతీసింది.
సాంకేతిక విభాగం:
ఇళయరాజా సంగీతం పరవాలేదనిపిస్తుంది. కొన్ని కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగా పనిచేసింది. అరవింద్ కన్నబిరాన్ సినిమాటోగ్రఫీ కథ మూడ్‌కు తగ్గట్టుగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అయితే జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ మరింత పదునుగా ఉండాల్సింది.
దర్శకుడు సతీష్ కాసెట్టి కొత్త తరహా సైకలాజికల్ థ్రిల్లర్‌ను అందించే ప్రయత్నం చేసినప్పటికీ, కథలోని సామర్థ్యాన్ని పూర్తిగా తెరపై ఆవిష్కరించలేకపోయారు. కథ బాగున్నా, కథనం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు.
తీర్పు:
‘మరీచిక’ ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్. అయితే నెమ్మదిగా సాగే కథనం, బలహీనమైన దర్యాప్తు ట్రాక్, ప్రభావం లేని ట్రీట్మెంట్ కారణంగా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. రెజీనా, అనుపమ, విరాజ్ అశ్విన్ నటనలు మెప్పించినప్పటికీ, మొత్తం మీద ఇది నిరాశపరిచే చిత్రంగా నిలుస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!