

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. గత 15 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశానని, కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి టైమ్‌పాస్ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తించామని, ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగలేదని, అక్రమ కేసులతో వేధించలేదని తెలిపారు. కేసీఆర్ మేనిఫెస్టోలో లేనివి కూడా అమలు చేసిన నాయకుడని పేర్కొంటూ రైతు బంధు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలను గుర్తు చేశారు.
ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక రోజుకో కొత్త డ్రామా ఆడుతోందని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం, గొర్రెల స్కామ్, ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్ అంశాలను రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. తనపై తీవ్ర వ్యక్తిత్వ హననం జరుగుతోందని, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని అంతరాత్మ సాక్షిగా చెబుతున్నానన్నారు. విచారణకు భయపడనని స్పష్టం చేస్తూ సిట్ ముందు హాజరవుతానని చెప్పారు. అనంతరం కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి సిట్ కార్యాలయానికి బయల్దేరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!