

భారత్‌కు విశ్వసనీయతే అత్యంత బలమైన కరెన్సీగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచం భారత్‌ను వృద్ధికి నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఇది బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన లేదా కుదురుతున్న ఒప్పందాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్న మోదీ, అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్–మలేసియా భాగస్వామ్యాన్ని ఉమ్మడిగా రూపాంతరీకరణకు దారి చూపించే ఇంపాక్ట్’గా మోదీ అభివర్ణించారు. ఇరు దేశాలు భాగస్వాములుగా చేతిలో చేయి వేసుకుని ముందుకు సాగుతున్నాయని చెప్పారు. భారతీయ భాషలు, మలై భాష మధ్య ఉన్న సాంస్కృతిక సామ్యాలను గుర్తు చేస్తూ, ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని అన్నారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తో తనకు ఉన్న స్నేహాన్ని ప్రస్తావిస్తూ, తమిళ భాష, సాహిత్యం ప్రపంచానికి భారత్ ఇచ్చిన అమూల్యమైన కానుక అని మోదీ పేర్కొన్నారు.
ప్రవాస భారతీయుల్లో ఆరో తరం వరకూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు జారీ చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు మోదీ తెలిపారు. భారత్ విజయం మలేసియా విజయం మాత్రమే కాక ఆసియా విజయం కూడా అవుతుందన్నారు. మోదీ పర్యటనకు ఘన స్వాగతం లభించగా, సంప్రదాయ భారతీయ నృత్యాలతో 800 మంది కళాకారులు చేసిన స్వాగతం మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఆదివారం ఇరు ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!