

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం పల్లెల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. అసెంబ్లీ పోలింగ్ తరహాలోనే గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు తీవ్ర పోటీతో జరుగుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు రోజంతా గ్రామాల్లో తిరుగుతూ వివిధ పద్ధతులు ప్రయోగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఎలాంటి ఖర్చుకైనా వెనకడుగు వేయని పరిస్థితి కనిపిస్తోంది.
పోలింగ్‌కు ఒక రోజు ముందు నుంచే ఎక్కువ గ్రామాల్లో ఓటర్లను మెప్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ఇంటికింటికీ చికెన్ ప్యాకెట్లను పంపించేందుకు అభ్యర్థులు ముందుగానే స్థానిక వ్యాపారులతో ఆర్డర్లు వేసినట్లు సమాచారం. ఉదయం నుంచే అభ్యర్థుల బృందాలు గ్రామాల్లో తిరిగి ప్రతి ఇంటికీ చికెన్ చేరేలా చూసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మగ ఓటర్ల కోసం క్వార్టర్ బాటిళ్లూ సిద్ధంగా ఉంచినట్లుగా గ్రామాల్లో చర్చ నడుస్తోంది.
ఈ పద్ధతులు బయటపడ్డ తర్వాత, ప్రత్యర్థి అభ్యర్థులు నగదు పంపిణీకి సిద్ధమైనట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఓటు నిమిత్తం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు అందిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. చికెన్ తినని ఓటర్ల కోసం మటన్ పంపిణీకి కూడా ఏర్పాట్లు చేసిన గ్రామాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది.
వలస వెళ్లిన ఓటర్లను తిరిగి గ్రామాలకు రప్పించేందుకు ప్రత్యేక బస్సులు, కార్లు ఏర్పాటు చేసి ప్రయాణాన్ని భరించేందుకు ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారని కూడా సమాచారం వెలువడుతోంది. ఓటింగ్ అనంతరం ప్రయాణ ఖర్చులు చెల్లిస్తామని కొందరు అభ్యర్థులు హామీ ఇస్తున్నట్లు గ్రామాల్లో మాట వినిపిస్తోంది.
ఎన్నికల సమయం వచ్చే సరికి గ్రామాల్లో కనిపించే రద్దీ, ఆసక్తి, రాజకీయ కదలికలు ఈసారి మరింతగా పెరిగాయి. మొత్తం 4,236 గ్రామాల్లో రేపు సర్పంచ్ మరియు వార్డు సభ్యుల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో గ్రామాలు ఎన్నికల సందడితో కిక్కిరిసిపోయాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!