

నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ.. నటి త్రిషపై తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. బహిరంగ వేదికపై ఏ మహిళనైనా అవమానించే హక్కు ఏ రాజకీయ నాయకుడికీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం బలహీన నాయకత్వానికి నిదర్శనమని విమర్శిస్తూ, మహిళలను దూషించకుండా రాజకీయాల్లో నిలబడే ధైర్యం చూపాలని ఉదయనిధికి సవాల్ విసిరారు.
మహిళలను రాజకీయాల్లో పావులుగా ఉపయోగించే సంస్కృతిని ఖుష్బూ తీవ్రంగా తప్పుబట్టారు. యువ నాయకుడిగా ఉదయనిధి హుందాగా వ్యవహరిస్తారని భావించానని, కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశ కలిగించాయని అన్నారు. ఇప్పటికీ ఆయనలో పశ్చాత్తాపం కనిపించకపోవడం మరింత బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా త్రిషతో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచే ఆమె తనకు తెలుసని, తమ కుటుంబ సభ్యురాలితో సమానమని చెప్పారు. తన కుమార్తె వివాహ సమయంలో నాలుగు రోజుల పాటు తమ ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యురాలిలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!