

భారత రాజ్యాంగంలోని కీలక సూత్రమైన సహకార సమాఖ్య విధానం బలహీనపడుతోందని పలువురు రాజకీయ నేతలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ సమ్మిట్‌లో భాగంగా హైదరాబాద్‌లో శనివారం ‘తెలంగాణ అభ్యుదయం – సహకార సమాఖ్య పాలన’ అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. నిధుల కేటాయింపులో వివక్ష, గవర్నర్ల ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయాలు ఆలస్యం కావడం, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలు రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి సవాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించారు. మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరి, మొక్కజొన్న వంటి పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న కేంద్రం, పూర్తిస్థాయిలో కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు. దీంతో పంటల కొనుగోలు భారం రాష్ట్రాలపై పడుతోందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడంతో రాష్ట్రాలు బ్యాంకులు, బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. ఎన్నికైన అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తే రాష్ట్రాలకు న్యాయం ఎవరు చేస్తారని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ వ్యవహారంలో గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాలను 542 నుంచి 840కి పెంచితే ఎంపీల ప్రాధాన్యం తగ్గడంతో పాటు పార్లమెంటులో రాష్ట్రాల గొంతుక బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఝార్ఖండ్ మంత్రి శిల్పి నేహా టిర్కీ మాట్లాడుతూ తమ రాష్ట్రానికి కేంద్రం నుంచి రూ.1.36 లక్షల కోట్ల బొగ్గు రాయల్టీ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం (ఎంఎండీఆర్) సవరణల వల్ల బొగ్గు గనులపై కేంద్రం నేరుగా పన్నులు విధించే అవకాశం ఏర్పడిందని, దీంతో ఝార్ఖండ్‌కు ఏటా సుమారు రూ.10 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. పీసా చట్టం ద్వారా గిరిజన గ్రామసభలకు కల్పించిన అధికారాలు నియంగిరి, హస్దేవ్ అడవుల విషయంలో ఉల్లంఘనకు గురవుతున్నాయని విమర్శించారు. సామాజికవేత్త, రచయిత ప్రొఫెసర్ గణేష్ దేవీ మాట్లాడుతూ అంబేడ్కర్, నెహ్రూల ఆలోచనలతో రూపుదిద్దుకున్న భారత సమాఖ్య వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్రాల ఆదాయ వనరులను కేంద్రం కట్టడి చేస్తోందని, ప్రాథమిక విద్య, పరీక్షల నిర్వహణ వంటి అంశాల్లోనూ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థకు సుప్రీంకోర్టు రక్షగా నిలవాలని, రాజ్యసభను మరింత బలోపేతం చేయాలని సూచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆదిత్య మెహతా ఎన్నికల నిర్వహణలో సాంకేతిక వ్యవస్థలపై కేంద్రం నియంత్రణ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సంస్థలకు నిధులు, విధులు మరింతగా బదిలీ చేయాలని అభిప్రాయపడ్డారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రాలకు నిధులు, జలాల పంపిణీలో వివక్ష చూపకూడదన్నారు. మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య భారతంలో రాజ్యాంగం తొలిరోజు నుంచే ప్రతి పౌరుడికి సమాన ఓటు హక్కు కల్పించిందని గుర్తుచేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!