

అనంతపురం జిల్లాలో చేపట్టిన జలసంరక్షణ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టిన ప్రయత్నాల వల్ల అనంతపురంలో పచ్చదనం పెరిగిందని ఆయన అన్నారు. జలాశయాలను శుద్ధి చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రజలు బాధ్యతగా స్వీకరించారని ప్రధాని కొనియాడారు.
ఆదివారం జనవరి 25, 2026 న జరిగిన తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇది 2026 సంవత్సరానికి తొలి మన్ కీ బాత్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ ప్రజలు చేసిన కృషిని దేశానికి తెలియజేశారు.
అనంతపురం జిల్లా చాలా కాలంగా తీవ్ర కరువు సమస్యతో బాధపడుతోందని, అక్కడి నేల ఎర్రగా, ఇసుకతో నిండి ఉండటం వల్ల నీటి కొరత తీవ్రంగా ఉండేదని ప్రధాని వివరించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు స్థానిక ప్రజలు ముందడుగు వేసి, నీటి వనరులను శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ప్రభుత్వ అధికారుల సహకారంతో అనంతపురం నీటి సంరక్షణ ప్రాజెక్టు ను ప్రారంభించి, పది జలాశయాలను పునరుద్ధరించారని ప్రధాని తెలిపారు. అలాగే ఏడువేలకు పైగా మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని మెరుగుపరిచారని అభినందించారు. ఈ ప్రయత్నాల ఫలితంగా ఇప్పుడు జలాశయాలు మళ్లీ నీటితో నిండుతున్నాయని, ఇది ప్రజల సంకల్పశక్తికి నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
జలసంరక్షణను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ప్రజల కర్తవ్యంగా భావించినప్పుడే ఇలాంటి మార్పులు సాధ్యమవుతాయని ఆయన దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!