

కాళేశ్వరం ప్రాజెక్టుపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు చూస్తే ఈటల బీజేపీ నేతగా మాట్లాడుతున్నారా లేదా బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతున్నారా అన్నది అర్థం కావడం లేదన్నారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీలలో నీటి నిల్వ సురక్షితం కాదని, నీటిని లిఫ్ట్ చేయవద్దని కేంద్ర సంస్థ ఎన్‌డీఎస్ఏ సూచించినప్పటికీ, ఈటల మాత్రం కేటీఆర్ మాదిరిగా నీటిని ఎత్తాలని చెప్పడం ఆశ్చర్యకరమని విమర్శించారు. నిపుణుల అభిప్రాయాన్ని పక్కనబెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, నిర్మాణ లోపాలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మహేశ్ గౌడ్ అన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై కేటీఆర్ స్పందించకుండా ఇప్పుడు విమర్శలు చేయడం అనుభవ రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల నాణ్యతపై అనుమానాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో పంపులు ఆన్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, బీఆర్ఎస్, బీజేపీ రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు బయటపెడుతుందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!