

మాల్దాలో సర్ పరిశీలనకు వచ్చిన న్యాయాధికారులను ఘెరావ్ చేయడం తృణమూల్ కాంగ్రెస్ పాలనలోని జంగిల్రాజ్కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ప్రస్తుత ఎన్నికలు తృణమూల్ భయోత్పాతం మరియు భాజపా భరోసా మధ్య జరుగుతున్నవని ఆయన పేర్కొన్నారు. కూచ్ బీహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ, ఇవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలని అన్నారు. మే 4న ఫలితాల తర్వాత తృణమూల్ గూండాల అక్రమాలకు ముగింపు పలుకుతామని హెచ్చరించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని రోజూ దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం లేదని ఆరోపించారు. మాల్దాలో న్యాయాధికారులను నిర్బంధించిన ఘటన తృణమూల్ అహంకారానికి, దుర్వ్యవస్థకు నిదర్శనమని చెప్పారు. న్యాయపరమైన ఒత్తిడి పెరిగినప్పుడల్లా తృణమూల్ రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని, పరిస్థితి ఎంత దారుణంగా మారిందో సుప్రీంకోర్టు జోక్యం అవసరమైన స్థితి ఏర్పడిందని తెలిపారు.
అదేవిధంగా, చొరబాటుదారులను రక్షించేందుకు సర్, సీఏఏలకు తృణమూల్ వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మోదీ విమర్శించారు. హిందూ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. తృణమూల్ పాలనలో సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు చోటుచేసుకున్నాయని, చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ‘బెంగాల్’ అనే పేరును వాడకపోవడం ద్వారా రాష్ట్ర గుర్తింపును మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు. కాంగ్రెస్, లెఫ్ట్ తరువాత ఇప్పుడు తృణమూల్ పాలనలో బెంగాల్ అభివృద్ధి వెనుకబడిందని, ఒకప్పుడు జాతీయ సగటును మించి ఉన్న తలసరి ఆదాయం ఇప్పుడు తగ్గిందని అన్నారు. అలాగే 2029 నుంచి లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ప్రకటిస్తూ, ఈ హక్కు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళలకు త్వరలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!