

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసన చేపట్టింది. ఢిల్లీలో అరాచకం సృష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని జోషి ఆరోపించారు. సీజేపీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలని సూచించారు. ప్రధాని, హోంమంత్రి, ఎన్నికల సంఘాన్ని దూషించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, అది భారతీయ సంస్కృతిలో భాగం కాదని పేర్కొన్నారు.
సీజేపీ నిరసనను బీజేపీ ‘ఫ్లాప్ షో’గా అభివర్ణించింది. దేశ రాజధానిలో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన చేపట్టారని ఆరోపించింది. జంతర్ మంతర్‌కు చేరుకున్న వందలాది మంది యువకులు, పలువురు రాజకీయ నాయకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని మూక పాలనపై ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా పేర్కొంది. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ శక్తులతో కుమ్మక్కై అరాచకం సృష్టిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లు సీఈసీకి వ్యతిరేకంగా, SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సాగుతున్న పోరాటానికి నాయకత్వం వహించిన ఘనత కోసం పోటీ పడుతున్నాయని బీజేపీ నేత సంబిత్ పాత్రా విమర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!