

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రామగుండంలో ‘సింగరేణి కార్మిక గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప సభా నాయకుడు హరీశ్ రావు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. తెలంగాణ భవన్‌లో టీబీజీకేఎస్, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సమావేశం అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. లాభాల్లో కార్మికులకు పూర్తి వాటా ఇవ్వాలని, వైద్య మండలి ద్వారా అర్హులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, సింగరేణి ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, సంస్థకు రావాల్సిన బకాయిలను త్వరగా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి పరిస్థితి దిగజారిందని హరీశ్ రావు ఆరోపించారు. 2022–23లో రూ.2,022 కోట్లు, 2023–24లో రూ.4,712 కోట్లు, 2024–25లో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చినప్పటికీ ఈ ఏడాది లాభాలను ప్రకటించలేదని అన్నారు. సింగరేణికి ప్రభుత్వం, జెన్‌కో నుంచి సుమారు రూ.50 వేల కోట్ల చెల్లింపులు నిలిచిపోయాయని, కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జీవో 76 కింద మిగిలిన కార్మికులకు హక్కులు కల్పించాలని, డిపెండెంట్ ఉద్యోగాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని, సింగరేణి ప్రైవేటీకరణ చర్యలను ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి సింగరేణికి కొత్త గనులు కేటాయించేందుకు చొరవ చూపాలని కోరారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!