

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో పర్యటిస్తూ ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అయితే తెలంగాణ విద్యార్థుల సమస్యలు వినేందుకు ఆయన ఎప్పుడు వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ప్రశ్నించారు. విద్యార్థులు, యువతకు రాహుల్ గాంధీ అండగా ఉంటారని చెబుతున్నారని, మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యలను ఎప్పుడు తెలుసుకుంటారని నిలదీశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని ఆరోపించారు.
విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ అశోక్‌నగర్‌కు వచ్చి విద్యార్థులను కలవాలని రామచందర్‌రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణ విద్యార్థులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!