

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు మరింత వేగం పుంజుకుంది. నిన్న రీన్యూ ఎనర్జీ కంపెనీ తిరిగి ఏపీకి రావడం ప్రకటిస్తే, ఈ రోజు మరో అంతర్జాతీయ దిగ్గజం పెట్టుబడికి ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రాష్ట్రంలో ₹1.1 లక్ష కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.
లోకేష్ చెప్పిన వివరాల ప్రకారం, ఈ పెట్టుబడులు పునరుత్పత్తి శక్తి, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్, సౌర తయారీ వంటి ప్రధాన రంగాల అభివృద్ధికి వినియోగించబడనున్నాయి. అంతేకాకుండా, డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, మౌలిక వసతులు, పోర్టులు వంటి కీలక రంగాల్లో కూడా బ్రూక్‌ఫీల్డ్ భాగస్వామ్యాన్ని పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ భారీ పెట్టుబడి రాష్ట్రాన్ని గ్లోబల్ స్థాయిలో స్థిరమైన, భవిష్యత్‌ను దిశా నిర్దేశం చేసే పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టే అవకాశముందని లోకేష్ అన్నారు.
అంతేకాదు, లోకేష్ కృషితో రాష్ట్రానికి మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా దక్కింది. అమెరికాకు చెందిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ విశాఖపట్నంలో ₹15,000 కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
జగన్ హయాంలో ఎస్ఐపిబి సమావేశాలు అరుదుగా జరిగితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏడాదికే 12 సమావేశాలు నిర్వహించారు. దాదాపు ప్రతి నెలా ఒకసారి సమావేశం జరగడం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ఎంత పెరిగిందో స్పష్టంగా చూపిస్తోంది. ఇదే వేగం పెద్ద పెట్టుబడులు వరుసగా రాష్ట్రానికి రావడానికి ప్రధాన కారణంగా మారుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!