

దసరా పండుగ సందర్భంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం అక్టోబర్ 22, 2026 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.173 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని ‘జడల్’ పాత్రలో రఫ్ అండ్ రస్టిక్ లుక్తో కనిపించారు. అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా ఆయన నటన, యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇదిలా ఉండగా, ఓటీటీ వెర్షన్లో కొత్త సన్నివేశాలు ఉంటాయా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. థియేటర్లలో తొలగించిన కొన్ని భావోద్వేగ సన్నివేశాలను జోడిస్తారని, కొన్ని హింసాత్మక సన్నివేశాల్లో మార్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో నెట్ఫ్లిక్స్లో థియేటర్ల వెర్షన్నే అందుబాటులోకి తీసుకొస్తారా? లేక మార్పులతో కూడిన కొత్త వెర్షన్ను విడుదల చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!