

సీనియర్ హీరో రవితేజ ది ఓ విభిన్నమైన మనస్తత్వం. మిగిలిన హీరోల మాదిరిగా కాదు. సినిమా హిట్ అయితే ఒకలా, ఫ్లాప్ అయితే మరోలా ముందుకు వెళ్లే రకం కాదు. వరుసగా ఫ్లాపులు వస్తున్నా కూడా ఆయన పద్దతి మారదు. ఏ కథ చేయాలి, ఏ జానర్ ఎంచుకోవాలి, పబ్లిసిటీ ఎలా చేయాలి అనే ఆలోచనలతో రవితేజ ఎక్కువగా ఉండరు. సోషల్ మీడియా కూడా ఆయనకు పెద్దగా నప్పదు, నచ్చదు. హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా ఎప్పుడూ ఒకే రకం వ్యవహారం. ప్రీ రిలీజ్ ఫంక్షన్, కామన్ ఇంటర్వ్యూ అంతే. అంతకు మించి పబ్లిసిటీ అంటే ఆయనకు అంతగా ఇష్టం లేదు. సోషల్ మీడియాపై కూడా డోంట్ కేర్ యాటిట్యూడ్‌నే చూపిస్తారు. నిర్మాతలు నష్టపోయినా, సినిమాలు బాక్సాఫీస్ వద్ద దెబ్బతిన్నా కూడా ఆయన సేమ్ టు సేమ్.
ఇప్పటివరకు అనేక నిర్మాతలు లాస్ అయినా, డైరెక్టర్లు పక్కకు తప్పుకున్నా ఆయనకు మాత్రం ఫర్వాలేదు. సినిమాను నిలబెట్టాలనే ఆలోచన కూడా కనిపించదు. “నాకేం పట్టదు” అనే తత్వం రవితేజ ప్రత్యేకతగా మారింది. అయితే ఇప్పుడు కొత్త తరం హీరోలు రంగంలోకి వస్తున్నారు. రవితేజ సినిమాల సంఖ్య తగ్గుతోంది. గతంలో వరుసగా సినిమాలు చేసేవారు, ఇప్పుడు మాత్రం సినిమాల మధ్య గ్యాప్ పెరిగింది. ప్రస్తుతం చేతిలో ఒక సినిమా విడుదలకు రెడీగా ఉంది, మరోటి సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇప్పటికైనా ఒక హిట్ పడితే మళ్లీ నిర్మాతలు లైన్లోకి వస్తారు. గతంలో ‘ధమాకా’ విజయంతో మళ్లీ జోరు పెరిగినా, ఆ తర్వాతి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడైనా హిట్ వస్తే రవితేజ మార్కెట్ తిరిగి చైతన్యం పొందుతుంది.
ఇటీవల వరకు 25 కోట్ల పారితోషికం తీసుకున్న రవితేజ, ప్రస్తుతం 15 కోట్లు లేదా షేరింగ్ మోడల్లో సినిమాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి విడుదలకానున్న సినిమా హిట్ అయితే మళ్లీ తన స్థాయి తిరిగి పొందుతారు. లేకపోతే పరిస్థితి కాస్త కఠినంగా మారవచ్చు. అప్పటికైనా రవితేజ తన పద్దతి మార్చుకుంటారా? లేక “డోంట్ కేర్” స్టైల్లోనే కొనసాగుతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!