

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాటను నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో విడుదల చేశారు. బీవీఎస్ రవి కథ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. భక్తితోపాటు యాక్షన్, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు. తమన్ సంగీతం అందించిన తొలి పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా, అనంతు ఆలపించారు. కనకదుర్గమ్మ దివ్యశక్తి, కరుణ, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా ఈ పాట సాగుతుంది.
విజయవాడలో నిర్వహించిన పాట విడుదల కార్యక్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ, తొలిసారి భక్తిరస చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ విజయవాడ కనకదుర్గమ్మకు పరమ భక్తుడని గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా పాత్ర కోసం భవానీ దీక్ష నియమాలను పాటిస్తూ మాంసాహారానికి, పాదరక్షలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!