

ఒక దశలో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న జూనియర్ ఎన్టీఆర్, టెంపర్ సినిమా తర్వాత తన కెరీర్ను పూర్తిగా మలుపు తిప్పుకున్నారు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్, దేవర వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నారు. గత ఏడాది విడుదలైన దేవర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల పరంగా మంచి ఫలితాన్ని నమోదు చేసింది. అయితే వరుస హిట్ల మధ్య వచ్చిన వార్ 2 మాత్రం ఎన్టీఆర్ కెరీర్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది.
హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను తెలుగులో నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేశారు. సినిమా విడుదల అనంతరం డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్లు తీవ్రంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సుమారు రూ.80 కోట్ల నష్టం వాటిల్లిందన్న ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరిగింది. ఈ రూమర్లపై తాజాగా స్పందించిన నాగవంశీ, సినిమా హక్కులను రూ.68 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఒప్పందం ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ స్వయంగా ముందుకొచ్చి రూ.18 కోట్లు తిరిగి చెల్లించిందని తెలిపారు.
అలాగే థియేట్రికల్ రన్లో సినిమా రూ.35 నుంచి రూ.40 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు నాగవంశీ వివరించారు. ఈ లెక్కల ప్రకారం తనకు వచ్చిన నష్టం రూ.10 నుంచి రూ.15 కోట్ల మధ్య మాత్రమేనని స్పష్టం చేశారు. అనవసరంగా అతిశయోక్తులతో ప్రచారం జరుగుతోందని, వాస్తవాలకు దూరంగా ఉన్న కథనాలను నమ్మొద్దని నాగవంశీ పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!