

నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’పై భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దసరా’ తర్వాత వీరిద్దరి నుంచి వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్, వయొలెన్స్, హీరో ఎలివేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సవారీ జాతికి చెందిన జడల్‌గా నాని కనిపించగా, అతడి తల్లి సమ్మక్క తమ జాతి హక్కులు, గుర్తింపు కోసం పోరాడుతుంది. మొదట తల్లి పోరాటాన్ని పట్టించుకోని జడల్, అనుకోని పరిణామాల తర్వాత ఆమెకు అండగా నిలుస్తాడు. ప్యారడైజ్ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న శిఖంజ మాలిక్‌తో అతడి పోరాటం మొదలవుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశం ఆకట్టుకున్నాయి. తల్లీకొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమాకు బలంగా నిలిచాయి.
అయితే అవసరానికి మించి హింసను చూపించడం, దాని వెనుక బలమైన భావోద్వేగాన్ని ప్రేక్షకులకు చేరవేయలేకపోవడం ప్రతికూలంగా మారింది. ద్వితీయార్థంలో కథనం నెమ్మదించడం, హీరో–విలన్ సంఘర్షణ ఆశించిన స్థాయిలో పండకపోవడం సినిమాపై ప్రభావం చూపాయి. జడల్ పాత్ర కోసం నాని లుక్, శరీర భాష, యాక్షన్‌లో చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. సోనాలి కులకర్ణి సమ్మక్కగా ఆకట్టుకున్నారు. కాయదు లోహర్ తన పాత్రకు న్యాయం చేసింది. మోహన్ బాబు పోషించిన శిఖంజ మాలిక్ పాత్రకు మరింత బలం ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. అనిరుధ్ పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా పనితనం, నిర్మాణ విలువలు మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!