

సుధీర్ బాబు కెరీర్ గత 15 ఏళ్లలో 20 సినిమాలు వచ్చినప్పటికీ, అందులో హిట్లు అని చెప్పుకోదగ్గవి కేవలం మూడు మాత్రమే. మిగతావన్నీ ఫ్లాపులు లేదా డిజాస్టర్లే. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నా, మంచి కథల్ని ఎంచుకుంటున్నానన్న అభిప్రాయం ఉన్నా, సక్సెస్ మాత్రం అతనికి దూరంగానే ఉంది.
‘సమ్మోహనం’ సుధీర్ బాబుకు మంచి బ్రేక్ ఇచ్చినప్పటికీ, ఆయన ఆ విజయాన్ని కొనసాగించలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన పది సినిమాల్లో ‘నన్ను దోచుకుందువటే’ మాత్రమే కొంతవరకు ఆడింది. మిగతావన్నీ ఫ్లాప్ అయ్యాయి.
గత మూడు–నాలుగు సంవత్సరాలుగా సుధీర్ బాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ‘మామా మశ్చీంద్ర’ ఆయన కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాగా నిలిచింది. ‘హరోం హర’, ‘మా నాన్న సూపర్ హీరో’ మంచి పేరును తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పనితీరు చూపలేకపోయాయి. తాజాగా వచ్చిన ‘జటాధర’ ఆయన కెరీర్‌ను మరింత అట్టడుగుకు తీసుకెళ్లింది.
కెరీర్ పరంగా ఇబ్బందుల్లో ఉన్న సుధీర్, ట్రెండ్‌ను అనుసరిస్తూ దేవుడు-దయ్యం కాన్సెప్ట్‌తో ‘జటాధర’ చిత్రాన్ని చేశాడు. అయితే ఈసారి కూడా పరిస్థితి మెరుగుపడలేదు. ట్రైలర్ చూసి ఆశపడ్డ ప్రేక్షకులకు థియేటర్లలో తీవ్రమైన నిరాశ ఎదురైంది. ఈ సినిమా ఆయన కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్‌లలో ఒకటిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాకుండా, వీకెండ్‌కే సినిమా వాషౌట్ అయిపోయింది. దీంతో సుధీర్ బాబు కెరీర్ మరోసారి ప్రమాద సూచకాల ముందుంది. ఆయన జడ్జ్‌మెంట్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సుధీర్ సినిమాలకు మోస్తరు బడ్జెట్లు పెట్టడం, మార్కెట్ చేయడం కూడా కష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే ‘ది గర్ల్ ఫ్రెండ్’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో సుధీర్ చేయాల్సిన సినిమా ఉంది. ‘జటాధర’ షాక్ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగి, ఆయన కెరీర్‌కు అవసరమైన బ్రేక్ ఇస్తుందా అనే విషయంలో ఆసక్తి నెలకొంది.













.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!