

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి సినీరంగంలోకి అడుగుపెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెండేళ్ల విరామం తర్వాత ఆమె ‘పదహారు రోజుల పండుగ’ చిత్రంతో రీ-ఎంట్రీకి సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉంటే, రేణు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాదు టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ర్యాంప్ వాక్‌లో అనన్య నాగళ్ల, కౌశల్ మందా, రితికా నాయక్, రుహాణి శర్మ, ఈషా గుప్తా వంటి అనేక సెలబ్రిటీలు పాల్గొన్నారు.
అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఓ ఎమోషనల్ అనుభవాన్ని రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం అందరినీ కలిచివేసింది. ర్యాంప్‌పైకి వెళ్లే క్షణాల ముందు, ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ పై నుంచి జారిపడ్డాడు, ఇనుప స్టాండ్ తలపై పడటం వల్ల తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఆ షాకింగ్ సన్నివేశం చూసి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయని, అయినప్పటికీ షో ఆగిపోకూడదనే బాధ్యతతో ర్యాంప్‌పై నడవాల్సి వచ్చిందని చెప్పింది. తన కళ్లలో కనిపించిన ఎర్రటి నీళ్లు ఆ దుఃఖానికి సాక్ష్యాలని రేణు చెప్పి, “ప్రతి మనిషి వెనుక ఏమి బాధ దాగి ఉందో మనకు తెలియదు… అందుకే పరస్పరం మరింత దయతో ఉండాలి” అని హృదయపూర్వకంగా రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ చూసిన అభిమానులు ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, రేణు అందంగా, ధైర్యంగా కనిపించిందని ప్రశంసిస్తున్నారు.















కామెంట్స్ (1)
రేణు దేశాయ్ గారి ధైర్యం నిజంగా అభినందనీయం.