

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వేగంగా సాగుతున్న షూటింగ్‌ను ఈ ఏడాది అక్టోబర్ నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో యూనిట్ పనిచేస్తోంది. విజువల్ గ్రాండియర్‌కు పెద్దపీట వేస్తున్న రాజమౌళి ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ మరియు ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ‘వారణాసి’ విడుదల సమయానికి హాలీవుడ్ భారీ చిత్రాలు కూడా బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ‘గాడ్జిల్లా x కాంగ్: సూపర్‌నోవా’తో పాటు ‘పానిక్ కేర్‌ఫుల్లీ’ వంటి చిత్రాలు అదే కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రీమియం స్క్రీన్స్ కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా హాలీవుడ్ స్టూడియోలు ఐమ్యాక్స్ స్క్రీన్స్‌ను ముందుగానే బుక్ చేసుకోవడం ఆనవాయితీ. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ‘వారణాసి’కి ఎంత మేర స్క్రీన్ స్పేస్ దక్కుతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ సవాల్‌ను రాజమౌళి ఎలా ఎదుర్కొంటారో చూడాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!