

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ చిత్రం చుట్టూ రోజు రోజుకు కొత్త చర్చలు మొదలవుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ సినిమా అంటేనే భారీ స్థాయి అంచనాలు సహజం. పైగా మారుతి లాంటి కమర్షియల్ దర్శకుడు హార్రర్ కామెడీ జానర్లో ప్రభాస్‌ను చూపించబోతున్నారని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పుడు ఈ సినిమా పై హాట్ టాపిక్ గా మారింది దాని రన్ టైమ్. రిలీజ్‌కు ఇంకా నెలరోజులకు పైగా సమయం ఉన్నప్పటికీ, సోషియల్ మీడియాలో ‘ ది రాజా సాబ్’ నిడివి గురించి ఒక సంఖ్య వైరల్ అవుతోంది. ఈ రన్ టైమ్ చూసి కొంతమంది ఆశ్చర్యపడుతుంటే, మరికొందరు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా హార్రర్ కామెడీ సినిమాలు క్రిస్ప్ గా ఉంటేనే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. రెండు నుంచి రెండున్నర గంటల మధ్యలో కథ నిండా వినోదాన్ని ప్యాక్ చేస్తేనే ఆ జానర్ సరిగా పనిచేస్తుంది. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘రాజా సాబ్’ నిడివి 3 గంటలు 15 నిమిషాల వరకు ఉండొచ్చని బజ్. ఎంటర్టైన్మెంట్ చిత్రానికి ఈ నిడివి ఎక్కువైపోతుందేమో అన్న సందేహం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే గతంలో ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘యానిమల్’ వంటి మూడు గంటలకు పైగా నిడివి ఉన్న చిత్రాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు. కానీ అవన్నీ ఎమోషన్ లేదా యాక్షన్ ఆధారిత చిత్రాలే. హార్రర్ కామెడీ లాంటి జానర్లో మూడు గంటలు ఆకట్టుకోవడం మాత్రం నిజంగా క్లిష్టమైన పని. ఎక్కడైనా ల్యాగ్ వస్తే మొత్తం ఫ్లో దెబ్బతినే అవకాశం ఉంది. మారుతి ఈ ఛాలెంజ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.
ఇక మరో కోణం కూడా చర్చలో ఉంది. ప్రభాస్‌కు ఫ్యాన్స్ కావాల్సిన ఎలిమెంట్లు, వింటేజ్ స్టైల్స్, ప్రత్యేక సన్నివేశాలు ఎక్కువగా ఉండటం వల్లే రన్ టైమ్ పెరిగి ఉండొచ్చనే టాక్. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లు, పాటలు కూడా నిడివిని పెంచే అంశాలేనని లోపలి వర్గాలు చెబుతున్నాయి. ఎడిటింగ్ టేబుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో సెన్సార్‌కు వెళ్లే సమయానికి నిడివి పూర్తిగా మారవచ్చనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఇక అమెరికాలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కావడం గమనార్హం. సాధారణంగా నిడివి పెరిగితే రోజుకు పడే షోల సంఖ్య తగ్గుతుంది. దాంతో ఓపెనింగ్ కలెక్షన్ల పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు ఇంత ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేశారంటే సినిమా కంటెంట్ పై వారికి మంచి నమ్మకం ఉందని స్పష్టమవుతోంది.
ప్రస్తుతం ఈ రన్ టైమ్ కేవలం ఊహాగానాలే. అసలు నిడివి ఎంత అనేది సెన్సార్ ఫైనల్ కట్ వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఏదేమైనా ‘రాజా సాబ్’ నిడివి పై జరుగుతున్న చర్చ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!