

టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు, మార్ఫింగ్ ఫోటోలు మరియు అసభ్యకర ప్రచారానికి వ్యతిరేకంగా ఆమె చట్టపరమైన పోరాటాన్ని ప్రారంభించారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అనసూయ మొత్తం 42 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ జాబితాలో సినీ నిర్మాతలు, జర్నలిస్టులు, టీవీ యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉండటం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం, ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 73 మందిపై కేసులు నమోదు చేశారు.
అనసూయ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో అసభ్యకర వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అలాగే లైంగిక, క్రిమినల్ బెదిరింపులు చేయడం, ఆమె జీవనోపాధికి మరియు ప్రజా జీవితంలో భద్రతకు ముప్పుగా వ్యవహరించడం వంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని కఠినమైన సెక్షన్లు 75, 79, 336(4), 351, 356 తో పాటు ఐటీ చట్టంలోని 66-E, 67 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ వ్యవహారంపై గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదిక X (మాజీ ట్విట్టర్)లో స్పందించారు. అనసూయపై జరుగుతున్న వేధింపుల్లో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకురాలు బొజ్జ సంధ్యా రెడ్డి సహా పలువురు న్యూస్ యాంకర్లు అనసూయను కించపరిచేలా వ్యవహరించారని తీవ్రంగా విమర్శించారు. మహిళా రక్షణపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని పార్టీలో కొనసాగించకూడదని కాంగ్రెస్ అధిష్టానాన్ని చిన్మయి కోరారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!