

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ ట్రైలర్‌ను అక్టోబర్ 8న విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటించారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కరువు, అణచివేత, దోపిడీ వంటి పరిస్థితులను ఇందులో ఆవిష్కరించారు. ట్రైలర్‌ను వీక్షించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
విజయ్ దేవరకొండ సహజమైన, శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నారని, రాయలసీమ నేలతో మమేకమైనట్లు కనిపించారని నారా లోకేశ్ కొనియాడారు. రష్మిక మందన్న తన పాత్రకు అద్భుతంగా ప్రాణం పోశారని ప్రశంసించారు. చరిత్రలో అంతగా వెలుగులోకి రాని ఓ ఘట్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అక్టోబర్ 16న విడుదల కానున్న సినిమాకు గొప్ప విజయం దక్కాలని ఆకాంక్షించారు. 1854–1878 మధ్యకాలంలోని చారిత్రక ఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ కథలో, పన్నుల దోపిడీ, ఆకలి కేకలతో బాధపడుతున్న ప్రజల తరఫున బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ కనిపించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!