

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1960 జూన్ 10న జన్మించిన బాలకృష్ణ, 1974లో తాతమ్మకల చిత్రంతో బాలనటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా మంగమ్మగారి మనవడు సినిమాతో ఘన విజయాన్ని అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆయన సినీ ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.
సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా వేలాది మంది జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తున్నారు. సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న బాలయ్య, నేటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ మూడు తరాల అభిమానులను అలరిస్తున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!