

టాలీవుడ్‌లో ఇటీవల తీవ్ర చర్చకు దారితీసిన థియేటర్ రెంటల్ వ్యవస్థ వివాదం ప్రస్తుతం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల మధ్య పెరుగుతున్న విభేదాలు ఇండస్ట్రీ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ చిత్రాల విడుదలలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపించడంతో అన్ని వర్గాల ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫిక్స్‌డ్ రెంటల్ విధానాన్ని వచ్చే నెల 30 వరకు కొనసాగించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలోని థియేటర్ యజమానులు ప్రస్తుత రెంటల్ విధానం వల్ల నష్టాలు వస్తున్నాయని వాదిస్తున్నారు. ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం, విద్యుత్ చార్జీలు మరియు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ఒక్కసారిగా విధానం మార్చితే ఇప్పటికే ప్లాన్ చేసిన విడుదలలు ఇబ్బందుల్లో పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదం మరింత ముదరకముందే చిరంజీవి తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించి, అన్ని వర్గాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అందరికీ అనుకూలమైన మార్గం కనుగొనాలని సూచించిన ఆయన, పర్సెంటేజ్ విధానం అమలుపై సమగ్ర అధ్యయనం చేయడానికి చాంబర్ కమిటీ పని చేయనుందని తెలుస్తోంది. దీంతో పరిశ్రమలో కొనసాగుతున్న ఉద్రిక్తతకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!