

కోలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డోరతీ’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడి కెరీర్‌లో ఇది పదో ప్రాజెక్ట్ కావడం విశేషం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ డ్రామాలో కీర్తి సురేష్ ఇప్పటివరకు చూడని సరికొత్త, వైవిధ్యమైన అవతారంలో కనిపించనుంది. శిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కీర్తి సురేష్ సినిమా విశేషాలను పంచుకుంది.
కార్తీక్ సుబ్బరాజ్ తనకు సినిమా కథా సారాంశాన్ని పంపించారని, అది చదివిన వెంటనే తనకు ఎంతో నచ్చడంతో క్షణం కూడా ఆలోచించకుండా ప్రాజెక్ట్‌లో నటించేందుకు అంగీకరించానని కీర్తి సురేష్ తెలిపింది. ఈ గొప్ప చిత్రంలో తాను కూడా భాగం కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణం తనకు ఒక అభ్యసన ప్రక్రియలా అనిపించిందని, షూటింగ్ సమయంలో కార్తీక్ సుబ్బరాజ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెల్లడించింది. తన సినీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాన్ని ఈ సినిమా అందించిందని చెప్పుకొచ్చింది. ఇక సినిమా టైటిల్ గురించి మాట్లాడుతూ.. ‘డోరతీ’ అంటే దేవుడి వరం అని అర్థమని, ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అలాంటి వరంలా అనిపిస్తుందని, థియేటర్లలో ఈ అనుభూతి అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని కీర్తి సురేష్ పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!