

ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే భగవాన్’ అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నగరం, సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు గోపీ అచ్చర మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..
కన్నడలో దర్శకుడు ఎస్. నారాయణ వద్ద పనిచేసిన అనుభవంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన, స్కూల్ రోజుల నుంచే సుహాస్‌తో పరిచయం ఉందని తెలిపారు. ‘కలర్ ఫోటో’ నుంచి సుహాస్‌తో కలిసి ప్రయాణం కొనసాగుతూనే ఉందని, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రానికి కూడా పని చేసినట్లు చెప్పారు. ‘హే భగవాన్’ కథను సుహాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నానని, స్క్రిప్ట్ దశలో సుహాస్ జోక్యం లేకపోయినా సెట్స్‌పై తన అభిప్రాయాలు పంచుకుంటూ సహకరించాడన్నారు. ‘అంబాజీపేట’తో సుహాస్–శివానీ జంటకు మంచి పేరు రావడంతో, ఆ హిట్ పెయిర్‌ను మరోసారి తీసుకున్నామని వివరించారు. సుహాస్ బలం కామెడీ కావడంతో ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దామని, అయితే ఫాదర్-సన్ ఎమోషన్‌ను కొత్త కోణంలో చూపిస్తూ భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే అనుకోని సందర్భాలను ప్రతిబింబించేలా ‘హే భగవాన్’ అనే టైటిల్ పూర్తిగా సూటవుతుందని, సినిమా ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్వులతో అలరించి చివర్లో ఓ ఎమోషనల్ టచ్ ఇస్తుందని తెలిపారు.
నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాకు కావాల్సిన ప్రతిదానికీ పూర్తి మద్దతు ఇచ్చారని, కన్నడలో ఒక సినిమా చేసిన తర్వాత తెలుగులో ఇదే వారి తొలి ప్రయత్నమని చెప్పారు. వంశీ నందిపాటి గారు స్క్రిప్ట్ దశ నుంచే ఈ ప్రాజెక్ట్‌లో భాగమై, 36 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఈ చిత్రంలో సుహాస్ పాత్ర ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుందని, ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేసే విధంగా రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. నరేష్, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, అజయ్ ఘోష్ తదితరులు తమ నటనతో వినోదాన్ని రెట్టింపు చేశారని, నరేష్ గారితో పని చేయడం ప్రత్యేక అనుభవమని అన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండగా, సినిమా చూసిన వారు కడుపుబ్బా నవ్వించే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రశంసిస్తున్నారని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!