

పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినిపిస్తేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. 55వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయన సినీ ప్రయాణం మూడు దశాబ్దాలుగా ప్రత్యేకంగానే సాగుతోంది. ‘సుస్వాగతం’, ‘తొలి ప్రేమ’, ‘తమ్ముడు’ చిత్రాలతో సహజమైన నటన, ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో యువతకు చేరువయ్యారు. ‘బద్రి’, ‘ఖుషి’ సినిమాలతో స్టైల్ ఐకాన్‌గా మారారు. ‘జానీ’ పరాజయం ఎదురైనా అభిమానుల్లో ఆయనపై ఆదరణ తగ్గలేదు. ఆ తర్వాత ‘గబ్బర్‌సింగ్’తో ఘనంగా పుంజుకున్నారు. ‘అత్తారింటికి దారేది’లో భావోద్వేగ కోణాన్ని చూపించగా.. ‘గోపాల గోపాల’తో భిన్నమైన పాత్రను ఎంచుకున్నారు.
తదుపరి దశలో ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’ వంటి చిత్రాలతో మరోసారి తన మాస్ ఇమేజ్‌ను చాటుకున్నారు. భారీ అభిమానగణం ఉన్న హీరోగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. ఇటీవలి కాలంలోనూ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ‘వకీల్‌సాబ్’, ‘భీమ్లానాయక్’ తర్వాత ‘దే కాల్ హిమ్ ఓజీ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఆయన మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
సినిమాలతోపాటు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం కూడా ఎన్నో మలుపులు తిరిగింది. జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అనంతరం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి టాలీవుడ్ స్టార్ నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదిగారు.
పవన్ కల్యాణ్ వ్యక్తిగత అనుభవాలు, అభిరుచులు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. చిరంజీవి తమ్ముడిగా తన గుర్తింపును ఉపయోగించుకోకుండా ఉండాలని చిన్నతనంలో భావించేవాడినని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. చిన్నప్పుడు సినిమాకు వెళ్లినప్పుడు ఇంటర్వెల్‌లో సమోసా తినాలనిపించినా డబ్బులు లేక కొనలేకపోయేవాడినని గుర్తుచేసుకున్నారు. స్నేహితులతో పంతానికి పోయి వేడిగా ఉన్న బైక్ సైలెన్సర్‌ను పట్టుకుని చేయి కాల్చుకున్న ఘటనను కూడా జీవిత పాఠంగా పేర్కొన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల తనలో సహనం పెరిగిందని తెలిపారు.
పుస్తకాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మికత, జానపద సంగీతం పవన్ కల్యాణ్‌ను ప్రభావితం చేశాయి. పరీక్షలో కాపీ కొట్టబోయిన సమయంలో గాంధీజీ మాటలు గుర్తొచ్చి ఆ పరీక్షను వదిలేసి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇతిహాసాల్లో పరశురాముడి పాత్ర తనకు ఇష్టమని, రామాయణం, మహాభారతంలోని అంశాలను జీవితానికి అన్వయించుకుంటానని తెలిపారు. చిన్నప్పటి నుంచే జానపద గీతాలపై ఆసక్తి ఏర్పడిందని, అందుకే తన సినిమాల్లోనూ వాటికి ప్రాధాన్యం ఇచ్చేవాడినని చెప్పారు. ఇలా సినీ విజయాలు, పరాజయాలు, రాజకీయ పోరాటాలు, వ్యక్తిగత అనుభవాలతో సాగిన పవన్ కళ్యాణ్ ప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!